Hindi Movie About Bapu Garu....
వి.ఎ.కె. రంగారావు (సుప్రసిద్ధ సినీ, సంగీత, కళా విమర్శకుడు - గ్రామ్‌ఫోన్ రికార్డుల సేకర్త)
బాపు - రమణలతో నా అనుబంధం ఈ నాటిది కాదు. కొన్ని దశాబ్దాల క్రితం నాటి పరిచయం, ఆపైన స్నేహం, అత్యంత సాన్నిహిత్యం మాది. ‘బాపు గొప్ప దర్శకుడు, ఆయన చేతి కుంచెది గొప్ప రేఖ’ లాంటివి నేను చెప్పనక్కర లేదు. అది సూర్యుడికి దివిటీ పట్టడం లాంటిది.

ఆభరణాలకూ బాపు డిజైన్లు!
నా వ్యక్తిగత అనుభవాల విషయానికి వస్తే, నాకు గురుతుల్యులైన రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి గారితో నాకు పరిచయం కలిగించింది బాపు - రమణలే! ఆ రోజుల్లో ‘ఆంధ్రపత్రిక’ సచిత్రవారపత్రికలో పాటలపై నేను రాసిన ‘సరాగమాల’కు మల్లాది వారితో పేరు పెట్టించింది - రమణ అయితే, దానికి బొమ్మ వేసింది బాపు. ఆయన గీసే బొమ్మ, వేసే డిజైన్ ప్రత్యేకం. అవి నాకు ఎంత ఇష్టమంటే, ఆయన ఎంత సింపుల్ అంటే, నాకు లెటర్‌హెడ్స్, విజిటింగ్ కార్డులు కూడా ఆయనే డిజైన్ చేసి ఇచ్చారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే - ఉంగరాలు, నా కూతురు వరసైన ఒక అమ్మాయి పెళ్ళికి చేతి కంకణం, మెడలో వేసుకొనే పతకం వగైరా కూడా ఆయనే డిజైన్ చేశారు.

సినిమాల సంగతికొస్తే - తొలితరం తెలుగు చిత్రాలైన ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ల్లో కనిపించిన మన తెలుగుదనం, మన తెలుగు వాతావరణం క్రమేణా అంతరించిపోయాయి. మళ్ళీ ఆ పరిమళాన్నీ, వాతావరణాన్నీ తన సినిమాల్లోని తెలుగుదనం ద్వారా తెరపైకి తెచ్చారు బాపు - రమణ. ‘సాక్షి’ సినిమాతో ప్రారంభించి, తరువాత ఎన్నో చిత్రాల్లో దాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇక, వాళ్ళిద్దరి ద్వారా నాకు కలిగిన సన్నిహిత పరిచయాలూ అనేకం. అక్కినేని నాగేశ్వరరావుతో, గాయకుడు పి.బి. శ్రీనివాస్‌తో, బెంగుళూరుకు చెందిన సుప్రసిద్ధ డిస్ట్రిబ్యూటర్ ఎం. భక్తవత్సలతో సాన్నిహిత్యం వారిద్దరి చలవే. ఇవన్నీ బాపు -రమణలు నాకు మిగిల్చిపోయిన బరువు - బంగారాలు.

అపార సంగీత జ్ఞానం: హిందీ సినిమా సంగీతం బాపుకు తెలిసినంత తెలిసినవారు మరెవ్వరూ నాకు తెలియదు. ఆయనకు సంగీతమంటే ఎంత పిచ్చి ప్రేమంటే, స్వయంగా మా ఇంటికి వచ్చిన నా దగ్గరున్న అపురూపమైన రికార్డుల్లో నుంచి కొన్ని వందల హిందీ పాటలను తన స్పూల్ టేప్‌రికార్డర్‌పై రికార్డు చేసుకున్నారు. అవి వినీ వినీ, చివరకు వాటి గురించి నాకు కూడా తెలియని ఎన్నో విషయాలు చెప్పేవారు. ఒక్క సినిమా పాటలే కాదు... గజల్స్ గురించి, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం గురించి ఆయన పరిజ్ఞానం అపారం. వాటి గురించి అంత తెలిసినవారు మరొకరు నాకు తారసపడలేదు. ఆయనకు మెహదీ హసన్ గజల్స్ అన్నా, బడే గులామ్ అలీఖాన్ హిందుస్థానీ గానమన్నా ఎంతో ఇష్టం. ఇంకా ఎంతోమంది ఆయన అభిమాన గాయనీ గాయకులు.

బాపు - రమణల పాటల్లో కూడా మన తెలుగుదనం, మన సంస్కృతి సంప్రదాయం వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఆయన సినిమా సంగీతం తయారవుతున్నప్పుడు ఒక్కసారీ నేను పక్కన లేను. కానీ, మంచి మాట ఎవరు చెప్పినా వినేవారు. పేరు గుర్తు లేదు కానీ ఒక సినిమా విషయంలో నన్ను బాపు -రమణలు సంప్రతించారు. మువ్వనల్లూరు సభాపతయ్య రాసిన పదం ‘మంచి దినము నేడే...’ అన్నది ఆ సినిమాలో పెట్టాలనుకున్నారు. ఆ మాటే నాకు చెప్పారు. కానీ, అది మరీ నింపాదిగా ఉంటుందనీ, దాని బదులు ‘కృష్ణం కలయ సఖీ సుందరం...’ అనే తరంగం పెడితే బాగుంటుందనీ చెప్పాను. అదే సినిమాలో వాడారు.

అభిప్రాయాన్ని గౌరవించే స్నేహశీలత: వ్యక్తిగతంగా బాపు ఎంతోమందికి ఎన్నో సాయాలు చేశారు. ఆ జాబితా పెద్దది. ఎప్పుడు బాపు-రమణల దగ్గరకు వెళ్ళినా, వాళ్ళ సినిమాల గురించో, రచనల గురించో మాట వస్తే, నా అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పేవాణ్ణి. దాన్ని వాళ్ళు సహృదయంతో తీసుకొనేవారు. నేను బాగుందని చెప్పినా, బాగా లేదని చెప్పినా బాపు చిరునవ్వు నవ్వేసేవారు. వారిద్దరి పక్షాన రమణే స్పందించేవారు. ఒకసారి బాపు -రమణలతో నాకు పెద్ద గొడవే అయ్యింది. ‘బుల్లెట్’ సినిమాలో అనుకుంటా... శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగుతల్లికి...’ రచన వాడారు. అందులో ‘అమరావతీ గుహల’ అనే వాక్యాన్ని ‘అమరావతీ నగర’ అని మార్చి, పాడించారు. గతించిన కవి రాసిన మాటలో, పాటలో మనం మార్పులు చేయకూడదని నా వాదన. బాపు నవ్వేసి, ఆ మాట రమణతో చెప్పమన్నారు. అప్పట్లో వారితో కలసి పనిచేసిన మరో రచయిత శ్రీరమణ చేసిన మార్పు అది. ఆ మార్పును సమర్థిస్తూ, ఆయన తన వాదన వినిపించారు. నేను సంతృప్తి చెందకపోయినా, ఇంత వాదన జరిగినా, మా స్నేహానికీ, సాన్నిహిత్యానికీ అది అడ్డు కాలేదు. అది వారి సంస్కారం.

బొమ్మలే బంగారం
బాపు బొమ్మల విషయానికి వస్తే, ‘ఆంధ్రపత్రిక’లో నేను ‘సరాగమాల’ రాస్తున్న రోజుల్లో కథలకు బాపు వేసే బొమ్మలు మిగిలిన పత్రికల్లో వచ్చే బొమ్మలకు చాలా భిన్నంగా, చాలా సంక్లిష్టంగా ఉండేవి. క్రమంగా ఆయన బొమ్మలన్నీ సులభతరం అయ్యాయి. ఒకప్పుడు 44 గీతలతో బొమ్మ వేసిన ఆయన చివరకు 4 గీతలతో బొమ్మ వేసే దశకు పరిణమించారు. ఆయన వేసే బొమ్మల పర్‌స్పెక్టివ్ కూడా డిఫరెంట్‌గా ఉండేది. అది ఆ తరువాత ఆయన సినిమాలు తీసినప్పుడు అందులోనూ ప్రతిఫలించింది. ఊరకే నటీనటుల ముఖం చూపించకుండా, పక్కనే ఉండే ఆకు, తీగలతో సహా క్లోజప్‌లో చూపే ఫ్రేమింగ్ అందుకు ఉదాహరణ.
పుస్తకాలకు ఆయన వేసే బొమ్మలు ఎంత గొప్పగా ఉండేవంటే, విజయవాడలో ‘నవోదయ పబ్లిషర్స్’ రామ్మోహనరావు ప్రచురణలు ప్రారంభించాక, ఆ పుస్తకాల ముఖచిత్రాలన్నీ ఆయనవే. పుస్తకం బొమ్మ చూసి అద్భుతం అని కొనుక్కొని, తీరా పుస్తకం అంత గొప్పగా లేని అనుభవాలూ నాకు చాలానే ఉన్నాయి. ‘బొమ్మ బాగుంది కానీ, పుస్తకం అంత లేదండీ’ అంటే బాపు నవ్వేసేవారు. ఆయన బొమ్మల గొప్పదనం అది.    

పూవులతో పాటు నార తలకెక్కుతుంది. బాపు - రమణల వల్ల నాకూ అలాంటి అదృష్టం పట్టింది. నేను ప్రచురించిన ‘జనార్దనాష్టకం’ పుస్తకానికి బాపు వేసిన బొమ్మలు శృంగార పరాకాష్ఠతతో నన్ను ధన్యుణ్ణి చేశాయి. ఆ తరువాత నేను పరిచయం చేసిన శ్రీలక్ష్మణ యతీంద్రుల కోరికపై వారి ‘రసధుని’ (‘తిరుప్పావై’కి తెనిగింపు) పుస్తకానికి బాపు వేసిన బొమ్మలు మరో అద్భుతం. అవి ఆండాళ్ అంతరంగం నుండి దొంగిలించినవే - నిస్సందేహంగా! ఇటు బాపు గారు, అటు లక్ష్మణ యతీంద్రులు - వారిద్దరూ ఆ తిరుమల వెళ్ళే దారిలో నన్నొక మెట్టును చేశారు. నా జీవితాన్ని ధన్యం కావించారు.

రికార్డుల పైనా...: ఆ రోజుల్లో ఎల్పీ రికార్డులకు ఆ సంస్థల ఆర్టిస్టులు వేస్తే అంత బాగుండేవి కావు. అదే బాపు వేస్తే, ఆ రికార్డులకొక స్థాయి, హోదా వచ్చేవి. అప్పట్లో కొలంబియా వారికీ, గ్రామ్‌ఫోన్ కంపెనీ వారికి నేను సంకలనం చేసిన అనేక ఎల్పీ రికార్డుల కవర్ మీద బాపు బొమ్మ, కవర్ వెనుక ‘స్లీవ్ నోట్స్’ నాది ఉండేవి. అన్నమయ్య కీర్తనలపై వచ్చిన తొలి ఎల్పీ రికార్డుకు బాలమురళీకృష్ణ పాట, బాపు వేసిన తిరుమల ‘బంగారు వాకిలి’ బొమ్మ, నా నోట్స్ - ఇప్పటికీ ఒక తీపి జ్ఞాపకం. అలాగే, తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఎల్పీ ‘శ్రీకృష్ణ శ్శరణం మమ’కు ఆయన వేసిన గోపికా వస్త్రాపహరణం బొమ్మ, ఎస్పీబీ పాడిన వెంకటేశ్వర గద్యకు వేసిన చిత్రం, ‘రామదాసు కీర్తనలు’ ఎల్పీ, సినిమా పాటలతో చేసిన ‘శ్రీరామ నామం - శ్రీకృష్ణ గానం’ - ఇవన్నీ ఇప్పటికీ చిత్రకళా ప్రియులకూ, సంగీతాభిమానులకూ పండగ. ఎల్వీ ప్రసాద్ హిందీలో తీసిన తొలిచిత్రం ‘శారద’ (సి. రామచంద్ర సంగీతం) ఎల్పీకి మళ్ళీ బాపు బొమ్మే. బాపు గారు చనిపోయాక, చిత్రకళ ఉండదా అంటే ఎందుకుండదు!

హాస్యప్రియత్వం: ఆయన చిత్రాల్లో ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతాకల్యాణం’ లాంటి గొప్ప చిత్రాలు చాలానే ఉన్నాయి. అవీ అందరూ చెప్పేవే. కానీ, నాకు చాలా నచ్చిన సినిమా - ‘గోరంత దీపం’. అలాగే, ‘వంశవృక్షం’ చాలా గొప్ప సినిమా. అంత గొప్ప సినిమాయే - ‘భక్త కన్నప్ప’. బాపు - రమణల హాస్యం ఎంత గొప్పదంటే,వాళ్లు నా మీద, నా గ్రామ్‌ఫోన్ రికార్డుల పిచ్చిమీద  సరదాగా ఎన్నో కార్టూన్లు వేశారు. అలాగే వాళ్ళ సినిమా ప్రివ్యూ చూసి నేను బయటకు వస్తుంటే, రమణ గారు ‘ఈ సినిమా మీకు నచ్చలేదుగా’ అని అడిగేవారు. ‘నచ్చలేద’ని అంటే, ‘హమ్మయ్య.. ఇక ఫరవాలేదు. సినిమా బాగా ఆడుతుంది’ అనేవారు. నా అభిరుచి, మాస్ ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా ఉంటుందని అంత సున్నితంగా హాస్యభరితంగా చెప్పడం వాళ్ళకే చెల్లింది. నాకు మిగిల్చిపోయిన ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలకు ఆ జంటకు కృతజ్ఞుణ్ణి. రవివర్మ చనిపోతే చిత్రకళ లేకుండా పోయిందా? లేదు కదా! బాపు గారి చిత్రకళాప్రభావం కూడా ఇంకో వందేళ్ళు తరువాతి చిత్రకారులపై ఉంటుంది. అది పైకి తెలిసేటట్లు కనిపించకపోయినా, తరువాతి తరాల వారి బొమ్మల్లో అంతర్లీనంగా ప్రతిఫలిస్తుంది.  

Gossips

Agnyaathavaasi Official Teaser

Agnyaathavaasi Official Teaser

Balakrishna Jai Simha Trailer

Balakrishna Jai Simha Trailer

Akshay Kumar PADMAN Official Trailer

Akshay Kumar PADMAN Official Trailer

Trisha Mohini Official Trailer

Trisha Mohini Official Trailer

Film Making
Jaguar Telugu Movie Making
More...
Special Interviews
Jr NTR, Samantha & Koratala Siva Exclusive Interview
More...
Movie Trailors
Thodari - Official Trailer - Dhanush, Keerthy Suresh
More...
Short Films


More...